జాలిగా జాబిలమ్మా రేయి రేయంతా - స్వాతికిరణం
జాలిగా జాబిలమ్మా రేయి రేయంతా
రెప్ప మూయనే లేదు, ఎందు చేతా? ఎందు చేత?
పదహారు కళలని పదిలంగా ఉంచని
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత
కాటుక కంటి నీరు పెదములనంటనీకు
చిరు నవ్వు దీపకళిక చిన్నబోనివ్వకూ
నీ బుజ్జి గణపతినీ, బుజ్జగించి చెబుతున్నా
నీ కుంకుమకెపుడు ప్రొద్దుగుంకదమ్మా.
సున్ని పిండిని నలిచి, చిన్నారిగా మలిచి,
సంతసాన మునిగింది సంతులేని పార్వతి.
సుతుడన్న మతిమరచి, శూలాన మెడవిరిచి,
పెద్దరికం చూపే చిచ్చుకంటి పెనిమిటి.
ప్రాణపతినంటుందా!!? బిడ్డగతి కంటుందా!!?
ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి.
కాలకూటం కన్నా ఘాటైన గరళమిది,
గొంతునులిమే గురుతై వెంటనే వుంటుంది.
ఆటు పోటు ఘటనలివి, ఆట విడుపు నటనలివి.
ఆదిశక్తివి నీవు! అంటవు నిన్నేవి!
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా,
కంచి కెళ్ళిపోయేవే కధలన్ని!!