Saturday, April 21, 2007

గజేంద్ర మోక్షం పద్యాలు- Gajendra Moksham


గజేంద్ర మోక్షం పద్యాలు

-శ్రీ బొమ్మెర పోతన

కరి దిగుచు మకరి సరసికి
కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్
కరికి మకరి మకరికి కరి
భరమనుచును నతల కుతల భటులరుదు పడన్ !!

నానానేకప యూధముల్ వనము లోనన్ పెద్ద కాలంబు స
న్మానింపన్ దశ లక్ష కోటి కరిణీ నాధుండ నై యుండి మ
ద్దానాంభః పరిపుష్ట చందన లతాంతచ్చాయ లందుండ లే
కీ నీరాశ ఇటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వరా !!

కలడందురు దీనుల యెడ
కలడందురు భక్త యోగి గణముల పాలం
గలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో !!

లోకంబులు లోకేశులు
లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వడు
ఏకాకృతి వెల్గు నతని నే భజియింతున్ !!

ఎవ్వని చేఁ జనించు జగ? మెవ్వని లోపల నుండు లీనమై?
ఎవ్వని యందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం
బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానె యైన వా
డెవ్వడు? వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ !!


లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !!


అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ః ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభి యై !!

సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడా కర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు గజప్రాణా వనోత్సాహి యై !!


అడిగెద నని కడు వడి జను
అడిగిన తన మగుడ నుడువడని నెడయుడుగున్
వెడ వెడ జిడి ముడి తడ బడ
నడుగిడు నడిగిడదు జడిమ నడుగిడు నెడలన్ !!

0 comments:

Post a Comment