Friday, April 20, 2007

Telugu Grammer - తెలుగు ఛందస్సు - 101 - Sri Sanka Rama Krishna

తెలుగు ఛందస్సు - 101

కొంత కవితావేశం కలిగి, పద్యాలు రాయాలనుకొంటున్న మా చెల్లెలు, తనకు
తెలుగు ఛందస్సు వివరిస్తూ ఉత్తరం రాయమంది. నాకు గుర్తున్నంత వరకు
ఛందస్సు సూత్రాలని, నేను పద్యాల నడక నేర్చుకొన్న తీరునూ, సమ్మిళితం
చేసి ఒక చిన్న వ్యాసం రాయాలన్న నా చిరకాల కోరిక ఇలా తీరింది.

ఇది రాయటంలో మొత్తంగా నా జ్ఞాపకశక్తి పైనే ఆధారపడ్డాను. అందువల్ల
ఇందులో కొన్ని తప్పులు దొర్లి ఉండ వచ్చు. అయినా, ఉన్న తప్పులు "యతి మైత్రి
వర్గాలు", "కంద పద్యం సూత్రాలు" అనే అంశాల్లోనే అని నా నమ్మకం. మీకు ఈ
వ్యాసంలో కనిపించిన దోషాలు, ముద్రా రాక్షసాలు సహృదయతతో నాకు
తెలియ పరిస్తే, దిద్దుకుంటాను.

ఇట్లు

భవదీయుడు,

సంకా రామకృష్ణ
(ర్సంక@ఉస.నెత్)


లఘువు: ఏక మాత్రా కాలంలో ఉచ్చరించ బడేది లఘువు. దీని గుర్తు "ఈ".
సాధారణంగా హ్రస్వాలు లఘువులవుతాయి.
ఈ ఈ ఈ ఈ
ఉదా: త, న, ద్వి, క్ల

గురువు: ద్వి మాత్రా కాలంలో ఉచ్చరించ బడేది గురువు. దీని గుర్తు "ఊ".
సాధారణంగా దీర్ఘాలు గురువులవుతాయి.
ఊ ఊ ఊ ఊ ఊ
ఉదా: కో, సం, కై, లా, యెల్

గురు, లఘు నిర్ణయం చేసేటప్పుడు సాధారణంగా పై ఉదాహరణలలో
చూప్పినట్టు అక్షరాల పైన వాటి గుర్తులుంచుతారు.

సంయుక్తాక్షరాలు (ఉదా: త్ర, క్లు వంటివి), ద్విత్వాలు (ఉదా: త్త, ప్పు వంటివి)
ముందు వున్న అక్షరాన్ని గురువును చేస్తాయి.

ఉదా:
"మిత్ర" అనే పదంలో విడిగా చూస్తే "మి" ని లఘువుగా గుర్తించినా
"త్ర" అనే సం యుక్తాక్షరం ముందు ఉండటం వలన అది గురువవుతుంది.

అలాగే "తప్పు" అనే పదంలో "ప్పు" అనే ద్విత్వాక్షరం ముందు ఉండటం
వలన "త" గురువు అవుతుంది.

ఈ సూత్రానికి కారణం "మిత్ర", "తప్పు" అనే పదాలను ఉచ్చరించేటప్పుడు
"మిత్ ర", "తప్ పు" గా వినిపించటం కావచ్చు.

ఊ ఈ ఊ ఈ
అందువల్ల మిత్ర తప్పు అని గుర్తించాలి.

గణాలు:

ప్రతి పద్య రీతికీ ఒక విశిష్టమైన లయ వుంటుంది. ఆ లయను గురువు,
లఘువుల pattern తో సూచించ వచ్చు. అయితే ఈ లయను సులభంగా
సూచించటం కోసం కొన్ని సామన్యమైన గురువు, లఘువు combinations
ని "గణాలు"గా ఏర్పరచారు. సాధారణంగా ఒక గణంలో మూడు అక్షరాలు వుంటాయి.

య: ఈ ఊ ఊ భ: ఊ ఈ ఈ వ : ఈ ఊ (దీనిని లగం అని కూడా అంటారు)
ర: ఊ ఈ ఊ జ: ఈ ఊ ఈ హ : ఊ ఈ
త: ఊ ఊ ఈ స: ఈ ఈ ఊ ల : ఈ
మ: ఊ ఊ ఊ న: ఈ ఈ ఈ గ : ఊ



ఈ గణాలని గుర్తు పెట్టుకోవడానికి రెండు చిట్కాలున్నాయి.

1. ఈ నాలుగు సూత్రాలని కంఠస్థం చెయ్యండి:

అ) ఆది మధ్య అంత్య లఘువులు - య ర త - లు
ఆ) ఆది మధ్య అంత్య గురువులు - భ జ స - లు
ఇ) సర్వ లఘువు - - గణం
ఈ) సర్వ గురువు - - గణం


మొదటి రెండు సూత్రాలను ఇలా అన్వయించుకోవాలి:
ఆది లఘువు య గణం : ఈ ఊ ఊ
(అంటే మొదటి అక్షరం లఘువు - మిగతా రెండూ గురువులని అర్థం)
మధ్య లఘువు ర గణం : ఊ ఈ ఊ
అంత్య లఘువు త గణం : ఊ ఊ ఈ
అలాగే
ఆది గురువు భ గణం : ఊ ఈ ఈ
మధ్య గురువు జ గణం : ఈ ఊ ఈ
అంత్య గురువు స గణం : ఈ ఈ ఊ

2. ఇంకొక పద్ధతి ఏమిటంటే
"య మా తా రా జ భా న స ల గం"
అనే phrase ని కంఠస్థం చెయ్యటం.

ఇందులో ఇప్పుడు ఏ గణం కావాలంటే ఆ అక్షరం దగ్గర మొదలు పెట్టి
మూడు అక్షరాలను తీసుకొని లఘువు గురువులు గుర్తించాలి.

ఉదా: య గణం : "య మా తా" అంటే ఈ ఊ ఊ
అలాగే స గణం : "స ల గం" అంటే ఈ ఈ ఊ

మీకు ఏ పద్ధతి తేలికగా అనిపిస్తే ఆ పద్ధతిని అనుసరించ వచ్చు.

యతి - ప్రాస
:

తెలుగు కావ్యాలలో ఉపయోగించే పద్య రీతుల్లో చాలా వరకు సంస్కృతం
నుంచి దిగుమతి చేసుకొన్న వృత్త రీతులే. "ఉత్పలమాల", "చంపకమాల",
"మత్తేభం", "శార్దూలం" వీటిలో ప్రముఖమైనవి. అయితే తెలుగుకు
ప్రత్యేకమైన పద్య రీతులు లేక పోలేదు. అచ్చంగా తెలుగుకు చెందినవి
"కందం", "సీసం", "గీత పద్యాలు : తేటగీతి - ఆటవెలది".

అయితే ఇలా సంస్కృతం నుండి గ్రహించిన వృత్తాలను కూడా, తెలుగు తన
ప్రత్యేకతలను ఆపాదించే స్వీకరించింది. సంస్కృత వృత్తాలకు తెలుగు
చేర్చిన విశేషాలు "యతి", "ప్రాస" నియమాలు.

యతి:
యతి అంటే విరామం అని అర్థం. లయబద్ధమైన పద్య నడకలో సహజంగా
వచ్చే pause (విరామం) ని యతి స్థానం అంటారు. తెలుగు పద్యాలలో ఈ యతి
స్థానంలో ఉండే అక్షరం పాదం మొదటి అక్షరంతో "యతి మైత్రి" లో
ఉండాలనేది నియమం.

ఈ క్రింది అక్షర వర్గాలలో ఒక వర్గంలోని అన్ని అక్షరాలూ పరస్పరం
యతి మైత్రిలో ఉంటాయి.
1. అ, ఆ, ఐ, ఔ, హ, య, అం, అః
2. ఇ, ఈ, ఎ, ఏ, ఋ
3. ఉ, ఊ, ఒ, ఓ
4. క, ఖ, గ, ఘ, ఞ, క్ష
5. చ, ఛ, జ, ఝ, శ, ష, స, ఙ
6. ట, ఠ, డ, ఢ, ణ
7. త, థ, ద, ధ, న
8. ప, ఫ, బ, భ, మ, వ
9. ణ, న
10. ర, ఱ, ల, ళ

హల్లుల యతి మైత్రి పాటించేటప్పుడు వాటితో కూడిన అచ్చులకు కూడా యతి
మైత్రి పాటించాలి. అంటే: "చ", "జ" ఒకే యతి మైత్రి వర్గంలో ఉన్నా
"చ" కి "జి" తో మైత్రి కుదరదు.

సంయుక్తాక్షరాలు వచ్చిన చోట, యతి కోసం ఏ అక్షరాన్నైనా గణించవచ్చు.
ఉదా: "క్రొ" మొదటి అక్షరం అనుకోండి. యతి మైత్రి కోసం దీన్ని "కొ" గా
గానీ "రొ" గా గానీ భావించ వచ్చు.

ప్రాస:
పద్య పాదంలోని రెండో అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు. తెలుగులో వృత్తాలలో,
కంద పద్యంలో అన్ని పాదాలలో ప్రాసాక్షరం ఒక్కటే ఉండాలనేది నియమం.
ప్రాసాక్షరం అన్ని పాదాలలోనూ ఒకే గుణింతంలో ఉండనక్కరలేదు.

ముందు ముందు వివరించబోయే పద్యరీతుల ఉదాహరణలలో ఈ నియమాలను
గమనించ వచ్చు.

వృత్తాలు



ఉత్పలమాల


ఈ వృత్తం నడక ఇలా ఉంటుంది:


"తానన తాన తాన తన తానన తానన తాన తాన తా"

|____ యతి మైత్రి ____| 10 వ అక్షరం తో

దీనిని మూడు మూడు అక్షరాలుగా విభజించి గణాలు గుర్తిస్తే

భ ర న భ భ ర వ
ఊ ఈ ఈ ఊ ఈ ఊ ఈ ఈ ఈ ఊ ఈ ఈ ఊ ఈ ఈ ఊ ఈ ఊ ఈ ఊ
తానన తాన తా న తన తానన తానన తాన తా న తా

అంటే
ఉత్పలమాల వృత్తంలో "భ ర న భ భ ర వ" గణాలు వస్తాయి
10 వ అక్షరం తో యతి మైత్రి అని చెప్పవచ్చు.

ఉదా:
(దీనిని - మీకు తెలిసిన ఇతర ఉత్పలమాల పద్యాలను - పైన చెప్పిన
నడక తీరులో చదవటం అలవాటు చేసుకొంటే పద్యాలు ఏ వృత్తానికి
చెందినవో గుర్తించటం, పద్యం కంఠస్థం చేయటం, రాయటం
సులువవుతుంది)

తొండము నేక దంతమును తోరపు బొజ్జయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్


పై పద్యంలో మొదటి పాదాన్ని ఉత్పలమాలకి సూచించిన నడక ప్రకారం
కొంచెం విడ దీసి రాస్తే:

తానన తాన తాన నన తానన తానన తాన తాన నా

తొండము నేక దంత మును తోరపు బొజ్జయు వామ హస్త మున్


చూశారా ఈ పద్యంలో పదాల అల్లిక మనం రాసుకున్న నడకకి ఎంత
దగ్గరగా ఉందో?!(ఈ పద్యం ఉదాహరణగా తీసుకోవడానికి ఇదొక
కారణం!) అన్ని పద్యాల్లో ఇంత దగ్గర కలయిక ఉండకపోవచ్చు.
ఈ పద్యంలోనే నాలుగో పాదం చూడండి:

తానన తాన తాన నన తానన తానన తాన తాన నా

యుండెడి పార్వ తీత నయ యోయిగ ణాధిప నీకు మ్రొక్కె దన్


పదాల విరుపు కొంచెం అసహజంగా ఉంటుంది. అయినా పద్యాల నడక
పట్టుబడాలంటే కొంత కాలం పద్యాలని ఇలా చదవక తప్పదు.
నడక కొంత పట్టు చిక్కాక ఇలా విరవకుండానే పద్యాన్ని చదవచ్చు.

ఇంకో గమనించ దగ్గ విశేషం ఏమిటంటే, మనం రాసుకొన్న నడకలో,
రెండో సారి "తానన" వచ్చే ముందు కొంచెం pause వచ్చి "తానన"
తాళంలో దెబ్బ లాగా మంచి ఊపుతో వస్తుంది. ఈ తానన లో "తా" యతి
స్థానం కావటం యాదృచ్ఛికం కాదు. చెప్పొచ్చేదేమిటంటే పద్యాన్ని మనం
రాసుకున్న నడకలో చదివితే యతి స్థానం దానంతటదే తెలుస్తుంది
- అక్షరాలు లెక్కేసుకోవలసిన పని లేదు.

ఇప్పుడు formal గా గణవిభజన చేసి చూద్దాం:

భ ర న భ భ ర వ
ఊ ఈ ఈ | ఊ ఈ ఊ |ఈ ఈ ఈ|ఊ ఈ ఈ | ఊ ఈ ఈ|ఊ ఈ ఊ| ఈ ఊ

కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై


"ద్విత్వం / సం యుక్తం ముందర అక్షరాలను గురువు చేస్తాయి"
అనే సూత్రం వల్ల "గుజ్జు", "విద్య", "కెల్ల", "నొజ్జ" లను
"ఊ ఈ" గా గుర్తు పెట్టాము.

ప్రాస అన్ని పాదాలలోనూ బిందు పూర్వక "డ" సరిపోయింది.

యతి : 1వ అక్షరం "కొం" - "కో" 10వ అక్షరం సరిపోయింది.

చదువరులు అన్ని పాదాలనూ ఇలాగే విభజించి సరి చూసుకోవచ్చు.
నడక ప్రకారం చదువుతూ యతి స్థానాన్ని గుర్తించడం, పద్యంలో
అన్ని గణాలూ సరిగా కుదిరిందీ లేనిదీ కనిపెట్టటం సాధన చేయాలి.
పద్యంలో అక్కడక్కడా అక్షరాలని వదిలి ఎక్కడ పద్యం నడక
తప్పిందీ గుర్తించడం పద్య నడక అలవడటంలో మంచి సాధననిస్తుంది.




చంపకమాల


ఇది ఉత్పలమాలకి సహ-వృత్తం అని చెప్పవచ్చు.
దీనికీ ఉత్పలమాలకీ ఉన్న ఒక్కటే తేడా ఏంఇటంటే ఉత్పలమాలలోని
మొదటి గురువు, చంపకమాలలో రెండు లఘువులవుతుంది.

అంటే ఉత్పలమాల నడక

"తానన తాన తాన తన తానన తానన తాన తాన తా"
అయితే
|____ యతి మైత్రి ____| 10 వ అక్షరం తో

చంపకమాల నడక

"న నన తాన తాన తన తానన తానన తాన తాన తా"

|______ యతి మైత్రి _____| 11 వ అక్షరం తో

(షరా: మీకిష్టమైతే దీన్నే

"ధిరనన ధీం న తోం న నన ధీం తక తోం తక ధిక్కు ధిక్కు ధా"

అనీ రాసు(నేర్చు)కోవచ్చు)

ఈ నడకను కూడా మూడు మూడు అక్షరాలుగా విభజించి గణాలు గుర్తిస్తే

న జ భ జ జ జ ర
ఈ ఈ ఈ ఈ ఊ ఈ ఊ ఈ ఈ ఈ ఊ ఈ ఈ ఊ ఈ ఈ ఊ ఈ ఊ ఈ ఊ
తనన న తాన తాన త న తాన న తాన న తాన తాన నా

టూకీగా చెప్పాలంటే:
చంపకమాల లో 4 పాదాలలోనూ
"న జ భ జ జ జ ర" గణాలు వస్తాయి, 11వ అక్షరంతో యతి మైత్రి.

ఉదా:

అలుగుట యే యెఱుంగని మహా మహితాత్ముడజాత శతృవే
యలిగిన నాడు సాగరములన్నియు నేకము కాక పోవు క
ర్ణులు పదివేవురైన నని నొత్తురు చత్తురు రాజ రాజ నా
పలుకుల విశ్వసింపుము విపన్నుల నార్తుల గావుమెల్లెడన్


(ఇది తిరుపతి వేంకట కవుల "పాండవోద్యోగ విజయాలు" లోనిది.
కౌరవ సభలో రాయబార సందర్భంలో కృష్ణుడు ధృతరాష్ట్రునితో చెప్పినది.)

పై పద్యాన్ని చంపకమాలకి చెప్పిన నడకలో చదువుకొని సరిగా ఉన్నదో
లేదో చూసుకోండి. ఆ తరువాత అన్ని పాదాలనూ గణ విభజన చేసి గణాలు
సరిపోయాయో లేదో గమనించండి.

ప్రాసాక్షరం : ల (నాలుగు పాదాలలో వరుసగా "లు, లి, లు, లు")
యతి: (మొదటి అక్షరానికీ 11వ అక్షరానికీ చూస్తే: )
1. "అ" -- "హా"
2. "య" -- "ల"
ఇవి రెండు కూడా నిజానికి ఒక యతి మైత్రి వర్గానికి చెందినవి కావు.
కానీ గమనించి చూస్తే ఇవి రెండూ సంధి వల్ల మారురూపంలో ఉన్న "అ" లు.
"యలిగిన" = "య్ + అలిగిన" , "లన్నియు" = "లు + అన్నియు" కాబట్టి
యతి మైత్రి "అ" -- "అ" కి సరిపోయింది.
3. "ర్ణు" -- "నొ"
"ర్ణు" లోని "ణు" గ్రహిస్తే యతి మైత్రి తేలికగా కనిపిస్తుంది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే "ణ" కి "న" కి మైత్రి కుదరటమే కాక,
వాటిని అంటి ఉన్న అచ్చులు "ఉ" కి "ఒ" కీ కూడా మైత్రి కుదిరింది.
4. "ప" -- "ప"




శార్దూలం


దీని నడక:

"తానా తానన తాన తాన తననా తానాన తానాన నా"

|________ యతి మైత్రి ________| 13 వ అక్షరం

ఇంకో రకంగా రాస్తే:

"ద్ధిత్తోం తక తోం న తోం న ధిరనా ద్ధిక్కు తద్ధిక్కు తా"

|______________ యతి మైత్రి _______________| 13 వ అక్షరం

గణ విభజన చేస్తే

మ స జ స త త గ
ఊ ఊ ఊ ఈ ఈ ఊ ఈ ఊ ఈ ఈ ఈ ఊ ఊ ఊ ఈ ఊ ఊ ఈ ఊ
తానా తా నన తా న తాన తననా తానాన తానాన నా

టూకీగా: శార్దూలం పద్యం 4 పాదాలలో
"మ స జ స త త గ" అనే గణాలు వస్తాయి. 13వ అక్షరంతో యతి మైత్రి.

ఉదా:

జండాపై కపి రాజు ముందు సిత వాజిశ్రేణినిన్ గూర్చి నే
దండంబున్ గొని దోలు స్యందనము మీదన్ నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండు చున్నప్పు డొ
క్కండున్నీ మొర నాలకింపడు కురుక్ష్మా నాథ సంధింపగాన్


(ఈ పద్యం కూడా "పాండవోద్యోగ విజయాలు" లో రాయబార ఘట్టంలోనిదే)
దీనిని నడక ననుసరించి చదవటం, గణ విభజన, యతి మైత్రి
గుర్తించటం చదువరులకు అభ్యాసం కింద వదిలి పెడుతున్నాను!

ప్రాస విషయంలో మాత్రం రెండు చిన్న విషయాలు సూచిస్తాను.
1. పాదంలో మొదటి అక్షరంలో గనక సున్నా వస్తే, దానికి కూడా ప్రాస
నియమం వర్తిస్తుంది. అంటే మొదటి పాదంలో మొదటి అక్షరం గనుక
బిందు పూర్వకమైనదైతే మిగతా మూడు పాదాలలోని మొదటి అక్షరాలు
కూడా బిందు యుక్తమైనవే అయి ఉండాలి. (ఈ సూత్రం ఉత్పలమాలకి ఇచ్చిన
ఉదాహరణలో చూడ వచ్చు.)
2. మొదటి పాదంలో ప్రాసాక్షరం గనుక సం యుక్తం, ద్విత్వం, లేక పొడి
అక్షరమైతే అన్ని పాదాలలోనూ అలాగే సం యుక్తం , ద్విత్వం, పొడి
అక్షరం గానే ఉండాలి.



మత్తేభం


ఇది శార్దూలానికి "సహ-వృత్తం". నిజానికి చాలా వృత్తాలు ఇలా జంటగా ఉంటాయి.
ఒక దాని మొదటి గురువు రెండో దానిలో రెండు లఘువులవుతుంది.

అందు వల్ల దీని నడక:

"ననా తానన తాన తాన తననా తానాన తానాన నా"

|________ యతి మైత్రి _________| 14 వ అక్షరం

ఇంకో రకంగా రాస్తే:

"క ధిత్తోం తక తోం న తోం న ధిరనా ద్ధిక్కు తద్ధిక్కు తా"

|______________ యతి మైత్రి _________________| 14 వ అక్షరం

గణ విభజన చేస్తే

స భ ర న మ య వ
ఈ ఊ ఊ ఊ ఈ ఈ ఊ ఈ ఊ ఈ ఈ ఈ ఊ ఊ ఊ ఈ ఊ ఊ ఈ ఊ
తననా తానన తాన తా న తన నా తానా న తానా న నా

టూకీగా: మత్తేభం పద్యం 4 పాదాలలో
"స భ ర న మ య వ" అనే గణాలు వస్తాయి. 14వ అక్షరంతో యతి మైత్రి.

ఉదా:

అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ః ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై


(ఈ పద్యం పోతన విరచిత "శ్రీమదాంధ్ర మహాభాగవతం" లోని
గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది)

దీనిని నడక ననుసరించి చదవటం, గణ విభజన, యతి మైత్రి
గుర్తించటం చదువరులకు అభ్యాసం కింద వదిలి పెడుతున్నాను!



ఇంకా చాలా రకాల వృత్తాలున్నాయి. కానీ ఇంకో రెండు మాత్రం కొంత
ప్రముఖంగా వాడ బడ్డాయి.

ఇవి "
మత్తకోకిల" , "తరలము" అనే జంట వృత్తాలు.

మత్తకోకిల నడక చాలా సులభంగా వుంటుంది:

"త్త కోకిల మత్త కోకిల త్త కోకిల కోకిలా"
"తాన తానన తాన తానన తాన తానన తాన తా"

|_____ యతి మైత్రి _____| 11 వ అక్షరం

దీనిలో గణాలు : "ర స జ జ భ ర"

చదువరులు ఊహించినట్టే "తరలము" నడక

"నన తానన తాన తానన తాన తానన తాన తా"

|_____ యతి మైత్రి _______| 12 వ అక్షరం
దీనిలో గణాలు : "న భ ర స జ జ గ"

మత్త కోకిల గణాలు రాసి చూస్తే అది యెంత "symmetric" గా ఉందో
అర్థమవుతుంది. కొంచెం నేర్పుగా రాస్తే ఈ వృత్తంలో "palindromes"
రాయ వచ్చు!

వృత్తాల నడక, గణాలు, యతి స్థానం
ఉత్పలమాల తానన తాన తాన తన తానన తానన తాన తాన తా భ ర న భ భ ర వ 10
చంపకమాల న నన తాన తాన తన తానన తానన తాన తాన తా న జ భ జ జ జ ర 11
శార్దూలం తానా తానన తాన తాన తననా తానాన తానాన నా మ స జ స త త గ 13
మత్తేభం ననా తానన తాన తాన తననా తానాన తానాన నా స భ ర న మ య వ 14
మత్తకోకిల తాన తానన తాన తానన తాన తానన తాన తా ర స జ జ భ ర 11
తరలము నన తానన తాన తానన తాన తానన తాన తా న భ ర స జ జ గ 12

తెలుగు పద్యాలు

ఇక అచ్చ తెలుగు పద్య రీతులకు వస్తే ముందుగా కొన్ని కొత్త గణాలు
నేర్చుకోవలసి ఉంటుంది. భయపడకండి, ఇవి మనకు పరిచయమైన
పాత గణాల నుంచే ఏర్పడ్డాయి.

ఇంద్ర గణాలు: నల, నగ, సల, భ, ర, త
నల : ఈ ఈ ఈ ఈ
నగ : ఈ ఈ ఈ ఊ
సల : ఈ ఈ ఊ ఈ
భ : ఊ ఈ ఈ
ర : ఊ ఈ ఊ
త : ఊ ఊ ఈ

సూర్య గణాలు: గల, న
గల : ఊ ఈ
న : ఈ ఈ ఈ




సీస పద్యం


సీస పద్యాన్ని ఒకే లాగా ఉండే నాలుగు పెద్ద పాదాలుగా కానీ (1, 1, 1, 1),
ఈ ఒక్కో పెద్ద పాదాన్ని రెండు చిన్న పాదాలుగా (1, 2, 1, 2, 1, 2, 1, 2)
మొత్తం ఎనిమిది పాదాలుగా కానీ వివరించవచ్చు. సీస పద్యంలో భాగం
కాక పోయినా సాధారణంగా సీస పద్యం తరువాత ఒక గీత పద్యం
("ఆటవెలది" లేదా "తేటగీతి") వస్తుంది.

1. ఒక పెద్ద పాదంలో వరుసగా 6 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలూ వస్తాయి.
2. ప్రాస నియమం లేదు.
3. యతి 1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతోనూ,
5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతోనూ
మైత్రి కుదరాలి.
4. ప్రాసయతి ఉండ వచ్చు.
అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు
రెండో అక్షరాలు ప్రాస నియమం పాటిస్తే చాలు - అంటే ఒకే అక్షరం అయి ఉండాలి
(ఏ గుణింతమైనా సరే).

ఈ అచ్చ తెనుగు పద్య రీతులలో ఖచ్చితమైన గణాలు చెప్పక పోవటం వల్ల
అన్ని పద్యాలు (అంతెందుకు ఒక పద్యంలోని అన్ని పాదాలూ) ఒకే లయలో ఉండనవసరం
లేదు. కానీ వీటి లయను గుర్తించడం అంత కష్టం కాదు. పద్యాలు పైకి
చదువుతూ ఉంటే లయ దానంతట అదే అవగతం అవుతుంది.

ఉదా:

సీ. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర
దీపాలు గగనాన త్రిప్పలేక
జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు
మామూలు మేరకు మడవలేక
పని మాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె
గడియారముల కీలు కదపలేక
అందాలు చింద నీలాకాశ వేదిపై
చుక్కల మ్రుగ్గులు చెక్కలేక

తే.గీ ఎంత శ్రమ నొందుచుంటివో యేమొ స్వామి!
అడుగిడితి వెట్లొ నేడు మా గడపలోన;
గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు
అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను


(అభినవ పోతన - కరుణశ్రీ - జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మధుర
మధురంగా భగవంతుని కర్పించిన హృదయ పుష్పాంజలి ఇది!)

1 2 3 4 5 6 7 8
త త త సల త సల గల గల
ఊ ఊ ఈ ఊ ఊ ఈ ఊ ఊ ఈ ఈ ఈ ఊ ఈ ఊ ఊ ఈ ఈ ఈ ఊ ఈ ఊ ఈ ఊ ఈ

లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక

|___ప్రాసయతి____| |______ యతి_______|


పై ఉదాహరణలో ప్రాస యతి ఉన్న అక్షరాలకు ప్రాసతో బాటు యతి కూడా కుదిరింది.
ప్రాస యతి అక్షరాలకి యతి మైత్రి అవసరం లేదు. ఇంకొక ఉదాహరణ చూడండి.

నగ సల నగ ర నల త న న
I I I U I I U I I I I U U I U I I I I U U I I I I I I I
కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో లతలకు మారాకు లతికి యతికి
|____ప్రాస యతి____| |__యతి మైత్రి__|

ఇక్కడ ప్రాస యతి ఉన్నది కానీ "లి" కి "లు" కి యతి మైత్రి లేదు.





తేటగీతి - ఆటవెలది

ఈ రెండు పద్యాల గణాలను ఒక ఆటవెలది పద్యంలో చెప్తారు:

సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు
దినకర ద్వయంబు తేటగీతి
ఇన గణ త్రయంబు ఇంద్ర ద్వయంబు
హంస పంచకంబు ఆటవెలది


తేటగీతి:
అన్ని పాదాలలోనూ 1 సూర్య గణం, 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వస్తాయి.

ఆటవెలది:
1,3 పాదాలలో : 3 సూర్య గణాలు, 2 ఇంద్ర గణాలు
2,4 పాదాలలో : 5 సూర్య గణాలు

గీత పద్యాలు రెండిటికీ common సూత్రాలు
1. ప్రాస నియమం లేదు
2. యతి మైత్రి మొదటి గణంలో మొదటి అక్షరానికి, 4వ గణంలో మొదటి
అక్షరానికి ఉండాలి.
3. ప్రాస యతి ఉండవచ్చు.

వేమన పద్యాలు అన్నీ ఆట వెలది పద్యాలు.
పైన ఉదహరించిన సీస పద్యం చివర ఉన్నది ఒక తేటగీతి పద్యం.

తేటగీతి - ఇంకొక ఉదాహరణ:

తివిరి ఇసుమున తైలంబు తీయ వచ్చు,
దవిలి మృగతృష్ణలో నీరు త్రాగ వచ్చు,
తిరిగి కుందేటి కొమ్ము సాధించ వచ్చు
చేరి మూర్ఖుని మనసు రంజింప రాదు


(ఇది పైడిపాటి "ఏనుగు" లక్ష్మణ కవి తెనిగించిన భర్తృహరి
సుభాషితాల లోనిది)




కంద పద్యం


కంద పద్యం అందం ఇంతా అంతా కాదు. అతి సుందరమైన పద్య రీతులలో
కందం ఒకటి.

1. కంద పద్యంలో
"గగ"(ఊఊ), "భ" (ఊ ఈ ఈ), "జ" (ఈ ఊ ఈ), "స"(ఈ ఈ ఊ), "నల" (ఈ ఈ ఈ ఈ)
అనే గణాలు వస్తాయి. గమనిస్తే అన్నీ 4 మాత్రలు కల గణలే!

2. కందంలో 1,3 పాదాలలో 3 గణాలు, 2,4 పాదాలలో 5 గణాలూ వుంటాయి.

3. బేసి (అంటే odd number) గణం "జ" గణం కారాదు.
అంటే 1,3 పాదాలలో 1,3 గణాలు, 2,4 పాదాలలో 2,4 గణాలు
"జ" గణం కాకూడదు.

4. 2,4 పాదాల అంతంలో "గురువు" ఉండాలి.
అంటే ఈ పాదాలలో 5వ గణం "గగ" లేదా "స" అయి ఉండాలి.

5. ప్రాస నియమం పాటించాలి. ప్రాసయతి పనికి రాదు.

6. యతి మైత్రి 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ, నాలుగో గణం
మొదటి అక్షరంతో కుదరాలి.

7. అన్ని పాదాలలో మొదటి అక్షరాలు అన్నీ హ్రస్వాలు గాని, అన్నీ దీర్ఘాలు
గానీ అయి ఉండాలి.

8. 2,4 పాదాలలో 3వ గణం "జ" కానీ "నల" కానీ అయి ఉండాలి.

చూడటానికి చాలా strict గా అనిపించినా, కందంలోని గణాలన్నీ నాలుగు
మాత్రల గణాలు కావటం వలన పద్యం లయ పట్టుకోవటం చాలా తేలిక.
ఒక సారి కంద పద్యం లయ అలవడితే పద్యాలు వాటంతట అవే ఈ సూత్రాలకు
అనుగుణంగానే వస్తాయి. సుమతీ శతక పద్యాలు అన్నీ కంద పద్యాలే.
మీకు వచ్చిన పద్యాలను నెమరు వేస్తూ లయ బద్ధంగా చదవటానికి పైకి
చదువుతూ సాధన చేస్తే పద్యాలు చదవటం, రాయటం, గుర్తుంచుకోవటం
తేలిక అవుతాయి!

ఉదా:

బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా ?!
బలవంతమైన సర్పము
చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ ?!


స స భ
ఈ ఈ ఊ |ఈ ఈ ఊ|ఊ ఈ ఈ
బలవంతుడ నాకేమని

నల గగ జ నల గగ
ఈ ఈ ఈ ఈ|ఊ ఊ|ఈ ఊ ఈ | ఈ ఈ ఈ ఈ | ఊ ఊ
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా

మిగిలిన రెండు పాదాల గణవిభజన చేయడం, అన్ని సూత్రాలూ సరి
చూసుకోవడం చదువరులకు అభ్యాసం!

0 comments:

Post a Comment