Friday, December 07, 2007

బొమ్మల రామాయణం - రామదాసు కీర్తనలు


1)తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు |త..|
ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనె యుండగ |త..|
మ్రుచ్చు సోమకుని మును జంపిన ఆ మత్స్య మూర్తి మన పక్షము నుండగ |త..|
భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మన వాడై యుండగ |త..|
దశ గ్రీవు మును దండించిన ఆ దశరథ రాముని దయ మన కుండగ |త..|
దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీ కృష్ణుడు మనపై కృపతో యుండగ |త..|
రామదాసుని గాచెడి శ్రీమన్నారాయణు నెఱ నమ్మి యుండగ |త..|

2)ఇక్ష్వాకు కుల తిలక
(రాగం: యదుకుల కాంభోజి, తాళం:మిశ్ర చాపు)
ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవే రామచంద్రా
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా |ఇక్ష్వాకు...|
భరతునకుఁ జేయిస్తి పచ్చల పతకము రామచంద్రా
ఆ పతకమునకుఁ బట్టె పదివేల వరహాలు రామచంద్రా !
శతృఘ్నునకు నే జేయిస్తి మొలత్రాడు రామచంద్రా
ఆ మొలత్రాటికిఁ బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా ! |ఇక్ష్వాకు...|
లక్ష్మణునకుఁ జేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా
ఆ పతకమునకుఁ బట్టె పదివేల వరహాలు రామచంద్రా !
సీతమ్మకుఁ జేయిస్తి చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకమునకుఁ బట్టె పదివేల వరహాలు రామచంద్రా ! |ఇక్ష్వాకు...|
కలికితురాయి మెలుకుగఁ జేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్రా !
నీ తండ్రి దశరథ మహరాజు పెట్టేనా రామచంద్రా ?
లేక మీ మామ ఆ జనక మహరాజు పంపేనా రామచంద్రా ? |ఇక్ష్వాకు...|
అబ్బా తిట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా
ఈ దెబ్బల కోర్వక; అబ్బా! తిట్టినయ్యా రామచంద్రా !
భక్తులందరిని పరిపాలించేడి శ్రీ రామచంద్రా
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని ఏలు రామచంద్రా ! |ఇక్ష్వాకు...|

3)ఇదిగో భద్రాద్రీ గౌతమి అదిగో చూడండీ
(రాగం: వరాళి, తాళం: ఆది)
ఇదిగో భద్రాద్రీ గౌతమి అదిగో చూడండీ, |ఇదిగో...|
ముదముతొ సీతా ముదిత లక్ష్మణులు కలిసి కొలువగా రఘుపతి యుండెడి, |ఇదిగో...|
చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతొ సుందరమై యుండెడి, |ఇదిగో...|
అనుపమానమై అతి సుందరమై దనరు చక్రము ధగ ధగ మెరసెడి, |ఇదిగో...|
పొన్నల పొగడల పూపొదరిండ్లను చెన్ను మీరగా శృంగారంబగు, |ఇదిగో...|
శ్రీ కరముగ శ్రీ రామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభు వాసము, |ఇదిగో...|
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండీ

4)ఏ తీరుగ నను దయ జూచెదవో
(రాగం: మాయామాళవ గౌళ, తాళం: ఆది)
ఏ తీరుగ నను దయ జూచెదవో ఇన వంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా |ఏ తీరుగ...|
శ్రీ రఘు నందన సీతా రమణా శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను కన్నది కానుపు రామా |ఏ తీరుగ...|
క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారము సేయవె దైవ శిఖామణి రామా |ఏ తీరుగ...|
వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామా
దాసార్చిత మాకభయమొసంగవె దాశరథీ రఘు రామా |ఏ తీరుగ...|

5)తారక మంత్రము కోరిన దొరికెను
(రాగం: ధన్యాశి, తాళం: ఆది)
తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా
మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని మది నమ్మన్నా |తారక ...|
ఎన్ని జన్మముల నుండి చూచినను ఏకో నారాయణుడన్నా
అన్ని రూపులైయున్న ఆ పరమాత్ముని నామము కథ విన్నా
ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్నా |తారక ...|
ధర్మము తప్పక భద్రాద్రీశుని తన మదిలో నమ్ముకయున్నా
మర్మము తెలిసిన రామదాసుని మందిరమునకేగుచునున్నా |తారక ...|

6)దినమే సుదినము
దినమే సుదినము సీతారామ స్మరణే పావనము |దినమే...|
ప్రీతినైనా, ప్రాణ భీతినైనా, కలిమి
చేతనైనా, నిన్నేరీతిఁ దలచినా |దినమే...|
అర్థాపేక్షను దినము వ్యర్థము గాకుండా,
సార్థకముగ మిమ్మేరీతి ప్రార్థన చేసినా |దినమే...|
నిరతము మెరుగు బంగరు పుష్పముల రఘు
వరుని పదమ్ముల నమర బూజించినా |దినమే...|
మృదంగ తాళము తంబుర శృతిఁ గూర్చి
మృదు రాగముల కీర్తనలు పాడినా విన్నా |దినమే...|
ఘనమైన భక్తిచే పెనగొని ఏ వేళ
మనమున శ్రీరాముని చింతించినా |దినమే...|
భక్తులతో అనురక్తిని గూడిన
భక్తిమీరఁ భక్తవత్సలుఁ బొగడిన |దినమే...|
దీన శరణ్యా, ఓ మహానుభావా! ఓ
గాన లోల నన్నుఁ గరుణింపు మని గొలిచీ
అక్కఱతో భద్రచలమున నున్న సీతారాములఁ జూచిన |దినమే...|

7)నను బ్రోవమని చెప్పవే
(రాగం: కల్యాణి, తాళం: మిశ్ర చాపు)
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి |నను బ్రోవమని...|
నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి
జనకుని కూతుర జనని జానకమ్మా |నను బ్రోవమని...|
ప్రక్కను చేరి చెక్కిలి నొక్కుచు
చక్కగ మరుకేళి చొక్కియుండెడు వేళ |నను బ్రోవమని...|
అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు
నిద్ర మేల్కొను వేళ నెలతరొ బోధించి |నను బ్రోవమని...|

8)పలుకే బంగారమాయెనా కోదండపాణి
(రాగం: ఆనంద భైరవి, తాళం: ఆది)
పలుకే బంగారమాయెనా కోదండపాణి, |పలుకే…|
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలోఁ నీ నామస్మరణ మరవ చక్కనిసామి |పలుకే...|
ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు
పంతము సేయ నే నెంతటి వాడను తండ్రి |పలుకే...|
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాద
కరుణించు భద్రాచల వర రామదాస పోష |పలుకే...|

9)పాహిమాం శ్రీరామా యంటే
పాహిమాం శ్రీరామా యంటే పలకవైతివే,
నీ స్నేహమెట్టిదని చెప్పనోహో! చెప్పనోహో! |పాహిమాం...|
ఇబ్బందినొంది, ఆ కరి బొబ్బ పెట్టినంత లోనే
గొబ్బూనాగాచితి వానిని జగ్గుసేయకా,
నిబ్బరముగ నేనెంతో కబ్బమిచ్చి వేడుకొన్నా,
తబ్బిబ్బు చేసెదవు, అబ్బబ్బా! |పాహిమాం...|
సన్నుతించు వారి నెల్ల మున్ను దయతొ బ్రోచితివని,
పన్నగశాయి, నేవిని, విన్నవించితిని,
విన్నపము వినక ఎంతో కన్నడ చేసెదవు రామ
ఎన్నటికీ నమ్మరాదు అన్నన్న! |పాహిమాం...|
చయ్యన భద్రాచల స్వామివని నమ్మి నేను
వెయ్యారు విధముల నుతి సెయ్య సాగితిని
ఈయెడను రామదాసుని కుయ్యాలించి బ్రోవకున్న
నీ యొయ్యారమేమనవచ్చు |పాహిమాం...|

10)పాహి రామప్రభో
(రాగం: మధయమావతి, తాళం: తిశ్ర ఆది)
పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో |పాహి రామప్రభో ...|
ఇందిరా హృదయారవిందాధి రూఢ
సుందరాకార నానంద రామప్రభో |పాహి రామప్రభో ...|
ఎందునే చూడ మీ సుందరా ననము
కందునో కన్నులింపొంద శ్యామప్రభో |పాహి రామప్రభో ...|
బృందారకాది బృందార్చిత పదార
విందముల సందర్శితానంద రామప్రభో |పాహి రామప్రభో ...|
తల్లివి నీవె మా తండ్రివి నీవె
మా దాతవు నీవు మా భ్రాత రామప్రభో |పాహి రామప్రభో ...|
నీదు బాణంబులను నాదు శతృల బట్టి
బాధింపకున్నావదేమి రామప్రభో |పాహి రామప్రభో ...|
ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచు
వాదింతునే జగన్నాథ రామప్రభో |పాహి రామప్రభో ...|
శ్రీ రామరామేతి శ్రేష్ఠ మంత్రము
సారె సారె కును వింతగా చదువు రామప్రభో |పాహి రామప్రభో ...|
శ్రీ రామ నీ నామ చింతనామృత పాన
సారమే నాదు మది గోరు రామప్రభో |పాహి రామప్రభో ...|
కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు
వెలసితివి భద్రాద్రి నిలయ రామప్రభో |పాహి రామప్రభో ...|
అవ్యయుడవైన ఈ అవతారములవలన
దివ్యులైనారు మునులయ్య రామప్రభో |పాహి రామప్రభో ...|
పాహి శ్రీ రామ నీ పాద పద్మాశ్రయుల
పాలింపుమా భద్రశైల రామప్రభో |పాహి రామప్రభో ...|

11)రామచంద్రులు నాపై
(రాగం: అసావేరి, తాళం: మిశ్ర చాపు)
రామచంద్రులు నాపై జాలము చేసినారు
సీతమ్మ చెప్పవమ్మా |రామచంద్రులు నాపై ...|
కటకటా వినడేమి జేయుదు
కఠిన చిత్తుని మనసు కరుగదు
కర్మములు ఎటులుండునో గదా
ధర్మమే నీకుండునమ్మ |రామచంద్రులు నాపై ...|
దినదినము మీ చుట్టు దీనతతో తిరుగ
దిక్కెవ్వరిక ఓ యమ్మ
దీనపోషకుడనుచు వేడితి
దిక్కులన్నియు ప్రకటమాయెను |రామచంద్రులు నాపై ...|
ఒక్కమాటైనను వినడు
ఎక్కువేమని తలతునమ్మ
దశరథాత్మజుడెంతో దయశాలి యనుకొంటి
దయాహీనుడే ఓ యమ్మ |రామచంద్రులు నాపై ...|
దాసజనులకు దాత అతడట
వాసిగ భద్రగిరీశుడట
రామదాసుని ఏల రాడట
రవికులాంబుధి సోముడితడట |రామచంద్రులు నాపై ...|

12)రామచంద్రాయ
(రాగం: కురంజి, తాళం: తిశ్ర ఆది)
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
కోసలేశాయ మందహాస దాసపోషణాయ
వాసవాది వినుత సర్వరాయ మంగళం
విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామితాయ శుభ్ర మంగళం
రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం